Leading News Portal in Telugu

G20 Dinner: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి అందని ఆహ్వానం.. జీ20 విందుకు వచ్చేది వీళ్లే..


G20 Dinner: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ20 దేశాధినేతలకు శనివారం విందు ఇవ్వనున్నారు. అయితే ఈ విందుకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ఆహ్వానం అందలేదని ఆయన కార్యాలయం తెలిపింది. ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ హోదా కలిగిని ఖర్గేకు ఆహ్వానించలేదు. క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శులు, ఇతర అతిథులు ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. మాజీ ప్రధానులైన డాక్టర్ మన్మోహన్ సింగ్, హెచ్‌డీ దేవెగౌడ కూడా అతిథుల లిస్టులో ఉన్నారు.

బీహార్ సీఎం నితీష్ కుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మన్ విందుకు హాజరవుతామని ప్రకటించిన ముఖ్యమంత్రుల్లో ఉన్నారు. ఆహ్వానించబడిన అతిథులంతా రేపు సాయంత్రం 6 గంటల వరకు పార్లమెంట్ హౌస్ కి చేరాలని కోరారు. అక్కడ నుంచి ప్రగతి మైదాన్ లోని భారత మండపానికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది కేంద్రం.

కేబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కార్యదర్శులు మరియు ఇతర ప్రత్యేక అతిథులందరినీ వారి నివాసం నుండి పార్లమెంట్ హౌస్‌కు తీసుకురావడానికి ఢిల్లీ పోలీసులు ప్రయాణ ప్రణాళికను రూపొందించారు. విందుతో పాటు సాంస్కృతిక సమావేశాలను నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ వివిధ దేశాధినేతలను వ్యక్తిగతంగా వేదిక వద్దకు స్వాగతిస్తారని అధికారులు తెలిపారు. వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానులు, విదేశాంగ మంత్రులు, వివిధ అంతర్జాతీయ సంస్థలకు చెందిన డెలిగేట్స్ మొత్తం 40 మందికి పైగా విదేశీ అతిథులు ఈ విందుకు హాజరవనున్నారు.