Leading News Portal in Telugu

Yogi Adityanath: రావణుడు, కంసుడి వల్లే కాలేదు.. “సనాతన” వ్యాఖ్యలపై యోగి కామెంట్స్..


Yogi Adityanath: డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మంటలు రేపుతున్నాయి. దీనికి తోడు మరికొంత మంది డీఎంకే నాయకులు ఉదయనిధికి మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో ఈ వివాదం ఇప్పడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. బీజేపీ ఉదయనిధిని టార్గెట్ చేస్తూ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది. ఆయన్ను హిట్లర్ తో పోల్చింది. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. డీఎంకే పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి హిందూమతాన్ని ద్వేషిస్తున్నాయని బీజేపీ విమర్శిస్తోంది.

ఇదిలా ఉంటే ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. సనాతన ధర్మంపై గతంలో కూడా అనేక దాడులు జరిగాయని, ఎటువంటి నష్టాన్ని కలిగించలేకపోయాని, ఈ రోజు కూడా పరాన్నజీవులతో ఎలాంటి హాని జరగదని అన్నారు. రావణుడి అహంకారం, కంసుడి గర్జన సనాతనాన్ని తుడిచేయలేకపోయాయని, బాబర్, ఔరంగజేబు దురాగతాలు కూడా సనాతనాన్ని ఏం చేయలేకపోయాయని, ఈ చిల్లర శక్తులు, పరాన్నజీవులు ఏం చేస్తాయని వ్యాఖ్యానించారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పోలీస్ లైన్స్ లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యోగి, ఉదయనిధి వ్యాఖ్యలను ఉద్దేశించి పరోక్షంగా స్పందించారు. సనాతన ధర్మాన్ని విమర్శించడం మానవాళిని ఇబ్బందుల్లోకి నెట్టే ఉరుద్దేశంతో కూడుకున్నవని అన్నారు. సనాతన ధర్మాన్ని సూర్యుడి శక్తితో అభివర్ణించారు. సనాతనాన్ని విమర్శించడం సూర్యుడిపై ఉమ్మేయడమే అని, అది తిరిగి వారి ముఖంపై పడుతుందని యోగి చెప్పారు. ఇలాంటి వారి చేష్టల వల్ల భావి తరాలు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని, భారతదేశ సంప్రదాయాల పట్ల గర్వపడాలని అన్నారు. దేవుడిని నాశనం చేయాలని అనుకున్నవాళ్లంతా నాశనమై పోయారని గుర్తు చేశారు. అంతకుముందు చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని, మలేరియా, డెంగ్యూలతో పోల్చారు.