Man Dies By Suicide After Wife Left Him: భార్యా భర్తల మధ్య గొడవలు కామన్. చాలా ఇళ్లల్లో ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఎంతో మంది భార్యలు అలిగి పుట్టింటికి వెళ్లిపోతూ ఉంటారు. తరువాత ఎలాగో అలా పెద్దలు ఒప్పించి కాపురాలను నిలబెడుతూ ఉంటారు. లేదంటే వారు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతారు. అయితే మహారాష్ట్రలో భార్య తనను వదిలి పుట్టింటికి వెళ్లిపోవడంతో ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన 2017 లో జరిగింది. అయితే తాజాగా ఆ కేసుకు సంబంధించిన తీర్పును కోర్టు వెలువరించింది.
వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన రాజ్ కుమార్ కనోజియా అనే వ్యక్తికి సాధన అనే మహిళతో వివాహం జరిగింది. రాజ్ కుమార్ పెళ్లైన మొదటి నుంచే పిల్లలను కనాలని సాధనను బలవంతం చేసేవాడు. అయితే వారిది చాలా ఇరుకైన ఇళ్లు కావడంతో కుటుంబ సభ్యుల మధ్యే సంసారం చేయలేక ఆ మహిళ ఆ విషయాన్ని దాటవేస్తూ వచ్చేది. ఇదే విషయాన్ని రాజ్ కుమార్ కు ఎన్ని సార్లు చెప్పినా అర్థం చేసుకునే వాడు కాదు. అయితే ఒక రోజు అతడు పనిలో ఉండగా మరో ఇళ్లు తీసుకొని వేరు కాపురం పెడదామని సాధన ఫోన్ చేసింది. అయితే రాజ్ కుమార్ మాత్రం దానికి ససేమిరా అన్నాడు. తన కుటుంబసభ్యులతోనే కలిసుండాలని కోరాడు. అయితే ఈ విషయంపై ఇద్దరికి తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే కొన్ని రోజులకు ఈ విషయంలో అలిగి సాధన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన రాజ్ కుమార్ 2017లో సూసైడ్ నోట్ రాసి మరణించాడు. అందులో భార్య పిల్లలను కందాం అంటే ఆ విషయాన్ని దాటవేస్తుందని, వేరు కాపురం పెట్టాలని గోల చేస్తుందని రాసి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు సాధనపై కేసు పెట్టారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ విషయంలో సాధనను నిర్దోషిగా ప్రకటించింది. పిల్లలను కందామా వద్దా అనేది మహిళ హక్కు అని పిల్లలు వద్దు అన్నంత మాత్రాన ఆమె భర్తను ఆత్మహత్యకు ప్రేరేపించిందని చెప్పలేమని కోర్టు పేర్కొంది. కేసును పరిశీలిస్తే భార్య తనపై పెత్తనం చెలాయిస్తుందని రాజ్ కుమార్ ఆత్మనూన్యత భావానికి గురయ్యే వాడని, అతడు హైపర్ సెన్సిటివ్ అని కోర్టు పేర్కొంది. వేరు కాపురం పెట్టడం కోసం డిమాండ్ చేయడాన్ని తప్పు పట్టలేమని, భర్త ఆత్మహత్య చేసుకోవాలనే ఆమె అలా డిమాండ్ చేసింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.