Leading News Portal in Telugu

Uttar Pradesh: కారులో వచ్చి మేకను ఎత్తుకెళ్లిన దొంగలు.. కాస్ట్లీ దొంగతనం..!


ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. అమేథీలో వీఐపీ తరహాలో దొంగలు చోరీకి పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కారులో వచ్చి మేకల దొంగతనానికి పాల్పడ్డాడు. అయితే దొంగలు కారు ఎవరికి కననపడకుండా ఉండటానికి.. చీకటిలో కొంత దూరంలో నిలిపారు. అనంతరం మేకను కారులో ఎక్కించుకుని పరారయ్యారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. కారులో వచ్చి మేకలను దొంగిలించిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. ఈ వ్యవహారం జైస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌదరానా ప్రాంతంలో జరిగింది. మహ్ఫూజ్ అహ్మద్ అనే వ్యక్తి తన ఇంటి సమీపంలో ఓ మేకను కట్టేశాడు. అయితే రాత్రి 2 గంటల సమయంలో కారులో వచ్చి మేకను ఎత్తుకెళ్లినట్లు మహ్ఫూజ్ చెప్పాడు. ఉదయం ఇంటి బయట కట్టేసి ఉంచిన మేక కనపడకపోవడంతో చుట్టూ పక్కలు వెతికాడు. అయినా కనిపించకపోవడంతో.. తన ఇంటి దగ్గర సీసీ కెమెరాలో చూశాడు. అప్పుడు ఈ ఘటన బయటపడింది.

ఇదిలా ఉంటే.. అంతకు ముందు రామ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో వెళుతున్న దొంగలు ఉప్పు బస్తాను దొంగిలించారు. రాత్రిపూట ఎవరూ లేరని ఐదు ఉప్పు బస్తాలతో పరారయ్యారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా వైరల్‌గా మారింది. ఈ చోరీ ఘటనపై పోలీసులపై విమర్శలు వచ్చినప్పటికీ.. ఉప్పు దొంగలను పోలీసులు పట్టుకోలేకపోయారు. మరోవైపు మేకను ఎత్తుకెళ్లిన ఘటనపై అమేథీ ఎస్పీ డాక్టర్ ఇలమార్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ కార్ డ్రైవర్ మేకను దొంగిలిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారని తెలిపారు. ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. ఫిర్యాదు అందిన తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.