Leading News Portal in Telugu

Matsya 6000: సముద్రయాన్..మరో ఘనత సాధించడానికి సిద్ధమవుతున్న భారత్


చంద్రయాన్ 3 తో జాబిల్లి రహస్యాలను తెలుసుకోనున్న భారత్ అంతరిక్షం గుట్టు మాత్రేమే కాదు లోతైన సముద్రం రహస్యలను కూడా తెలుసుకునేందుకు సిద్దమవుతుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా మాత్రమే కలిగి ఉన్న మానవసహిత జలాంతర్గాములును భారత్ కూడా అభివృద్ధి చేయనుంది. సముద్రయాన్‌ మిషన్‌ పేరుతో సముద్రం అడుగున 6 వేల మీటర్ల లోతుకు జలాంతర్గామిని పంపనున్నారు. ఈ ప్రాజెక్ట్ లో కీలకం జలాంతర్గామి మత్స్య-6000. ప్రస్తుతం దీని పనులు చివరి దశలో ఉన్నాయి. దీనిని చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేస్తోంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది దేశంలోనే మొట్టమొదటి మానవసహిత సముద్ర అన్వేషణ మిషన్. ఈ సబ్‌ మెర్సిబుల్ ఫొటోలు, వీడియోలను కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది సముద్రగర్భ అన్వేషణకు తోడ్పడే మానవసహిత జలాంతర్గామి అని ఆయన తెలిపారు.

ఈ జలాంతర్గామిలో ముగ్గురు కూర్చొని 6 కిలోమీటర్ల సముద్రపు లోతుకు చేరుకోవచ్చు.ఇది మొదటగా 500 మీటర్ల మేర నీటి అడుగులకు ప్రయాణం చేయనుంది. తరువాత ఆక్వానాట్‌ లు సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు వెళ్లేందుకు వీలుగా గోళాకార సబ్ మెరైన్ ను నిర్మిస్తున్నారు. ఈ మిషన్ ద్వారా సముద్ర గర్భ రహస్యాలను చేధించే అవకాశం ఉంది. సముద్ర వనరులు, జీవవైవిధ్యం మీద అధ్యయనం చేయడమే కాకుండా కోబాల్డ్, నికెల్, మాంగనీస్ వంటి విలువైన లోహాలు, ఖనిజాల గురించి అన్వేషించడానికి ఈ మిషన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆ సబ్‌ మెర్సిబుల్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కిరణ్ రిజిజు దానిలో కూర్చొన్నారు. దాని గురించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీని ద్వారా సముద్ర వనరుల వివరాలు తెలుసుకొని ఆర్థికవృద్ధి సాధించాలని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా దీని ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇక దీని ద్వారా చెన్నై తీరంలోని బంగాళఖాతంలోకి 2024 లేదా 2025లో ముగ్గురు ఆక్వానాట్స్‌ను పంపించనున్నారు.