Priyanka Tour: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మంగళవారం కులు, మండిలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రకృతి వైపరీత్యాల బాధితులను పరామర్శించి వారితో కలిసి బాధలను పంచుకున్నారు. రాష్ట్రంలో వరదలు, కొండచరియలు విరిగిపడి పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి.. ప్రజలు నిరాశ్రయులయ్యారు. హిమాచల్ ప్రభుత్వం తన స్థాయిలో సహాయం, పునరావాసం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో జరిగిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి హిమాచల్ ప్రజల పునరావాసానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని హిమాచల్ ప్రభుత్వం, ప్రజలు కోరుతున్నారు.
ఈ పర్యటనలో ప్రియాంక గాంధీతో పాటు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ ఉన్నారు. జూలై 14, 15 తేదీలలో భారీ వర్షాల కారణంగా.. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి.. కులు, మండి జిల్లాలలో విధ్వంసం సృష్టించాయి. జూన్ 24న ప్రారంభమైన రుతుపవనాల ప్రభావంతో సెప్టెంబర్ 11 వరకు రాష్ట్రంలో రూ.8679 కోట్ల నష్టం వాటిల్లింది. అంతేకాకుండా.. హిమాచల్ ప్రదేశ్లో వరదలు, వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో 260 మంది మరణించారు. రాష్ట్రంలో రూ.12,000 కోట్ల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి సుఖూ అంచనా వేసి.. హిమాచల్ ప్రదేశ్లో సంభవించిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.