Leading News Portal in Telugu

Sanatana Dharma: ఎలా పడితే అలా మాట్లాడితే గుడ్లు, నాలుక పీకేస్తాం: కేంద్ర మంత్రి


Minister Gajendra Singh Shekhawat warns The People Who are talking About Sanatana Dharma: ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి మాట్లాడిన నాటి నుంచి అందుకు సంబంధించిన రగడ కొనసాగుతూనే ఉంది. ఉదయనిధి వ్యాఖ్యలను సమర్థిస్తూ కొందరు మాట్లాడితే మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నేతలైతే ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తాజాగా కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సనాతన ధర్మం వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. రాజస్థాన్ లోని బర్మర్ లో ఎన్నికల ర్యాలీలో  పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘మన పూర్వీకులు వారి జీవితాలను పణంగా పెట్టి సనాతన ధర్మాన్ని కాపాడారు. దీనిని కొందరు వ్యక్తులు నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిని ఇక ఎంత మాత్రం ఉపేక్షించం. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి నాలుకలను పీకేస్తాం. దానిని తక్కువ చేసి చూస్తే వారి కళ్లను పీకేస్తాం. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, వారు రాజకీయంగా ఎదగలేరు’ అని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. ఇక సనాతన వ్యాఖ్యలపైనే బీజేపీ ఎంపీ సాధ్వి ప్రాగ్య సైతం స్పందించారు. సనాతన ధర్మాన్ని అంతం చేసే శక్తి ఎవరికీ లేదన్నారు. ఇలా మాట్లాడితే వారు హీరోలు కాబోరని ప్రకాష్ రాజ్, ఉదయనిధిని ఉద్దేశించి అన్నారు. వారు దేశానికి విలన్లు అవుతారన్నారు. డీఎంకే నేత ఉదయనిధి సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ దానిని మలేరియా, డెంగ్యూ తో పోల్చిన సంగతి తెలిసిందే. వాటిని నిర్మూలించినట్టే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలని మాట్లాడారు. అప్పటి నుంచి ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతూనే ఉన్నాయి.