Leading News Portal in Telugu

Nipah virus : కేరళలో నిఫా కలకలం.. మూడు జిల్లాల్లో కంటైన్‌మెంట్ జోన్


Nipah virus : అనాలోచితంగా మనిషి చేసిన వికృత చేష్టల ఫలితంగా ఆవిర్భవించిన కరోనా ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడిప్పుడే అందరు ఆ పీడకలని మరిచిపోతున్నారు. ఇంతలో మరో కొత్త వైరస్ విజృంభిస్తుంది. కేరళ రాష్ట్రాన్ని వణికిస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ వల్ల ఇద్దరు మృతి చెందారు. దీనితో కేరళ ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో కంటైన్‌మెంట్ జోన్ ప్రకటించింది. వివరాలలోకి వెళ్తే కేరళలోని కాలికట్ (కోజికోడ్) జిల్లాలో నిపా వైరస్ ఉన్నట్లు అనుమానం వ్యక్తం అయ్యింది. ఇప్పటికే ఈ జిల్లాలో ఇద్దరు జ్వరంతో మరణించారు. దీనితో ఇది నిపా అని నిర్ధారించడానికి నమూనాలను పూణే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కన్నూర్, వయనాడ్, మలప్పురం కోజికోడ్ జిల్లాల్లో కంటైన్‌మెంట్ జోన్ ప్రకటించింది. ఈ విషయం పైన స్పందించిన కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ, కేరళ ఆరోగ్య శాఖ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)ని సంప్రదించిందని.. అలానే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన నిపా రోగుల చికిత్స కి అవసరమయ్యే మోనోక్లోనల్ యాంటీబాడీస్ ని అందిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, కంటైన్‌మెంట్ జోన్ లో ఉన్న జిల్లాలలో నిఘా కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నాయని ఆరోగ్య మంత్రి తెలియజేశారు.

ప్రస్తుత పరిస్థితి గురించి చర్చించడానికి గత రాత్రి కోజికోడ్ లో సమావేశం నిర్వహించారు మంత్రి.. ఈ సమావేశానికి ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ , ప్రజాపనుల శాఖ మంత్రి మహ్మద్ రియాజ్, జిల్లాలోని ఎమ్మెల్యేలు,బాధిత ప్రాంతాల ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఇతర అధికారులు ఈ అత్యవసర సమావేశానికి హాజరు అయ్యారు. వ్యాధిగ్రస్తుల సంరక్షణ కోసం PPE కిట్లు, N95 మాస్క్‌లు మరియు వైద్య సిబ్బందికి ఇతర రక్షణ పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఆసుపత్రుల్లో తగిన సంఖ్యలో సిబ్బంది, మందులు ఉండేలా చూసుకున్నారు.