Leading News Portal in Telugu

Jammu Kahmir Encounter: ఇద్దరు ఉగ్రవాదుల హతం.. జవాన్‌ని కాపాడుతూ ఆర్మీ డాగ్ మృతి


Jammu Kahmir Encounter: జమ్మూ కాశ్మీర్‌లో రాజౌరీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. మంగళవారం సాయంత్రం జరుగుతున్న ఈ ఎన్‌కౌంటర్ లో ఒక ఆర్మీ జవాన్ మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆర్మీ డాగ్ యూనిట్ కి చెందిన కెంట్ అనే ఆరేళ్ల ఆడ లాబ్రడార్ కాల్పుల్లో మరణించింది.

రాజౌరీలోని నార్ల గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతుండగా.. ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య కాల్పులు జరిగినట్లు అడిషనల్ డీజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు. జమ్మూ ప్రాంతంలో ఉండే పూంచ్, రాజౌరీ జిల్లాలు చాలా ఏళ్ల క్రితమే ఉగ్రవాదం నుంచి బయటపడ్డాయి. కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యక్రమాలు జరగుతున్నప్పటికీ జమ్మూ ప్రాంతంలో ఈ కార్యకలాపాలు తక్కువగా ఉండేవి. అయితే ఇటీవలి కాలంలో జమ్మూలోని రియాసీ, పూంచ్, రాజౌరీ జిల్లాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. పీఓకే సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరీ జిల్లాల్లో ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్లలో 25 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టారు. ఇందులో 10 మంది భద్రతా సిబ్బంది మరణించారు.

తాజాగా రాజౌరీలో జరుగుతున్న ఎన్‌కౌంటర్ లో ఆర్మీ డాగ్ యూనిట్ కు చెందిన కెంట్ అనే డాగ్ మరణించడంపై పలువురు జవార్లు ఎమోషనల్ అయ్యారు. తన హ్యాండ్లర్ ప్రాణాలు రక్షించేందుకు కెంట్ తన ప్రాణాలను త్యాగం చేసింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బుల్లెట్లు తగిలి మరణించింది. కెంట్ త్యాగానికి గుర్తుగా ఆర్మీ ఒక వీడియోను షేర్ చేసింది. కెంట్ గత 5 ఏళ్లలో 8 ఆపరేషన్లలో పాల్గొంది. దట్టమైన అటవీ మార్గంలో కెంట్ ఉగ్రవాదుల జాడను పసిగట్టింది.