Nipah Virus: నిపా వైరస్ మరోసారి కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ వల్ల ఇద్దరు మరణించారు. వీరితో సంబంధం ఉన్న వారి ఆరోగ్యాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అయితే కొత్తగా వచ్చిన నిపా వైరస్ వేరియంట్ తక్కువ వ్యాప్తి ఉన్నప్పటికీ, మరణాల రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి ప్రకటించారు. పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ బృందాలు కేరళలోని కోజికోడ్ చేరుకున్నాయి. మొబైల్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి నిపా పరీక్షలు, గబ్బిలాల సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీకి తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే నిపా ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తోంది.
ప్రస్తుతం నిపా ఇన్ఫెక్షన్లకు కారణం అవుతున్నది ‘బంగ్లాదేశ్ వేరియంట్’అని ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని, వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ, మరణాల రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ తెలిపారు. నిపా రోగులకు చికిత్స చేయడానికి అవసరమైన మోనోక్లోనల్ యాంటీబాడీలను అందించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అంగీకరించిందని ఆమె సభకు తెలిపారు. కోజికోడ్ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మరణించగా.. మరో ఇద్దరికి ఇన్ఫెక్షన్ సోకిందని ఆమె ఆసెంబ్లీకి తెలిపింది.
నిపాని ఎదుర్కొనేందుకు నిఘా, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ సదుపాయాలను ఏర్పాటు చేశామని, కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కేరళలోని కోజికోడ్ జిల్లాలోని ఏడు గ్రామపంచాయతీలు..అటాన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి మరియు కవిలుంపర కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి, పూర్తిగా దిగ్భందించారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.