Central Cabinet: ఢిల్లీలో నేడు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరగబోతోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతుండడంతో కేబినెట్ ముందుకు ప్రత్యేక ఎజెండా రానుందని, పలు కీలక అంశాలు కూడా ఆమోదం పొందే అవకాశం ఉంది. అయితే జీ20 సమావేశాలు సక్సెస్ కావడంతో ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి చేరుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. పార్లమెంట్‌ను రద్దు చేసినా చేయొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. జమిలి లేదా మధ్యంతరం వైపు మొగ్గు చూపొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.
దీనిని మరింత బలపరిచేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు అంటే 5 రోజుల పాటు పార్లమెంట్ ఉభయ సభలను ప్రత్యేకంగా సమావేశపర్చనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇదివరకే వెల్లడించారు. అమృత కాల సమయంలో కొన్ని అంశాలపై ఫలప్రదమైన చర్చ జరుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.