Leading News Portal in Telugu

Karnataka: 20 సంవత్సరాల క్రితం దొంగతనం.. ఎట్టకేలకు చిక్కాడు


కర్ణాటకలో గేదెల దొంగతనానికి పాల్పడిన 78 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 58 ఏళ్ల క్రితం రెండు గేదెలు, ఒక దూడను దొంగిలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 1965లో గణపతి విఠల్ వాగూర్ అతని సహచరులలో మరొకరు దొంగతనం ఆరోపణలపై మొదటిసారిగా అరెస్టయ్యారు. అప్పటికి గణపతి విఠల్ వయసు 20 ఏళ్లు. ఆ సమయంలో ఇద్దరికీ బెయిల్ వచ్చినప్పటికీ.. వాగూర్ పరారీ అయ్యాడు. గణపతి విఠల్‌తో పాటు దొంగతనానికి పాల్పడ్డ మరో వ్యక్తి 2006లో మరణించాడు. అయితే గత వారం వాగూర్‌ను తిరిగి అరెస్టు చేసిన తర్వాత కోర్టు బెయిల్‌పై విడుదల చేసింది. అతని వయస్సును పరిగణనలోకి తీసుకుని కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని వారాల క్రితం విచారణలో ఉన్న పాత ఫైళ్లను పోలీసు బృందం పరిశీలించగా ఈ చోరీ ఉదంతం మళ్లీ వెలుగులోకి వచ్చింది.

కర్ణాటకలోని బీదర్ జిల్లాలో గేదెల చోరీ ఘటన చోటుచేసుకుంది. కర్నాటక పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని వివిధ గ్రామాల నుంచి వాగూర్ రెండు సార్లు పట్టుబడ్డాడు. 1965లో జంతువులను దొంగిలించినట్లు వాగూర్‌, కృష్ణ చందర్‌లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో వారిద్దరికీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే విడుదలైన తర్వాత వారెంట్లు, సమన్లకు వారిద్దరూ స్పందించడం మానేశారు. అయితే వారుండే గ్రామంలో పోలీసులు వెతికినప్పటికీ.. వారి ఆచూకీ లభించలేదు.

ఈసారి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా థక్లాగావ్ గ్రామంలో పోలీసులు అతని కోసం వెతుకులాటకు వెళ్లగా.. ఓ ఆలయం వద్ద వాగూర్ ను అరెస్టు చేశారు. అతను ఈ ఆలయంలో నివసిస్తున్నాడని తెలుసుకుని.. పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. అనంతరం మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు తీసుకొచ్చి అతన్ని కోర్టులో హాజరుపరిచారు.