Leading News Portal in Telugu

Udayanidhi Stalin: హిందీ భారతదేశాన్ని ఏకం చేస్తుందని చెప్పడం అసంబద్ధం


Udayanidhi Stalin: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఉదయనిధిని టార్గెట్ చేస్తూ.. బీజేపీ విమర్శలు చేస్తోంది. అయితే తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిందీ దివాస్ ప్రసంగంపై విమర్శలు గుప్పించారు. నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే భాష దేశాన్ని ఏకం చేయదని అన్నారు. గురువారం ‘హిందీ దివస్’ సందర్భంగా అమిత్ షా ఓ ప్రసంగంలో మాట్లాడుతూ.. హిందీ భారతదేశంలోని భాషల వైవిధ్యాన్ని ఏకం చేస్తుందని తెలిపారు. హిందీ ఎప్పుడూ ఏ ఇతర భారతీయ భాషతోనూ పోటీపడలేదని, అన్ని భాషలను బలోపేతం చేయడం ద్వారానే బలమైన దేశం ఆవిర్భవించదని అమిత్ షా అన్నారు.

అమిత్ షా వ్యాఖ్యను విమర్శిస్తూ.. ఉదయనిధి స్టాలిన్ ‘X'(ట్విట్టర్) లో తమిళంలో ఒక పోస్ట్‌లో ఇలా రాశారు. ‘హిందీ దేశ ప్రజలను ఏకం చేస్తుంది – ప్రాంతీయ భాషలకు అధికారం ఇస్తుంది’ అని కేంద్ర మంత్రి అమిత్ షా ఎప్పటిలాగే.. హిందీ భాషపై తన ప్రేమను కురిపించారు. ఆలోచన అనేది హిందీ చదివితే పురోగమించవచ్చని అరవడానికి ప్రత్యామ్నాయ రూపం. అని రాసుకొచ్చారు. హిందీ మాత్రమే గొప్పదనే భావజాలం నుంచి బీజేపీ బయటపడాలని అన్నారు. హిందీ చదివితేనే అభివృద్ధి చెందొచ్చు అనే అర్థం వచ్చేలా మాట్లాడడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు.

తమిళనాడులో తమిళం, కేరళలో మలయాళం మాట్లాడుతారని.. హిందీ ఈ రెండు రాష్ట్రాలను ఎక్కడ కలుపుతుంది.. సాధికారత ఎక్కడ వస్తుందని ప్రశ్నించారు. నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే హిందీ.. యావత్ దేశాన్ని ఏకం చేస్తుందని అనడం విడ్డూరంగా ఉందని ఉదయనిధి అన్నారు. ‘అమిత్ షా హిందీ కాకుండా ఇతర భాషలను ప్రాంతీయ భాషలుగా కించపరచడం మానేయాలి’ అంటూ #StopHindiImpositionతో పోస్ట్‌ చేశారు.