Leading News Portal in Telugu

Jammu Kashmir Encounter: 48 గంటలుగా కొనసాగుతున్న ఉగ్రవేట..


Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో ఎన్‌కౌంటర్ 48 గంటలుగా కొనసాగుతోంది. కోకెర్‌నాగ్ ప్రాంతంలో బుధవారం ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్ లో ఇప్పటికే ముగ్గురు అధికారులు మరణించారు. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోన్‌చక్‌తో పాటు జమ్మూ పోలీస్ డీఎస్పీ హిమాయున్ భట్ వీర మరణం పొందారు. అందరూ హై ర్యాంకింగ్ అధికారులు కావడంతో ఇటు ఆర్మీ, అటు పోలీస్ డిపార్ట్మెంట్‌కి భారీ ఎదురుదెబ్బ తాకింది. ఇదిలా ఉంటే మరో జవాన్ మిస్ అవ్వడంతో పాటు ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది.

రెండు రోజులుగా పీఓకే-జమ్మూకాశ్మీర్ మధ్య ఉన్న పర్వతాల్లో, దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. దట్టమైన అడవులు ఉగ్రవాాదులకు రక్షణ ఇస్తున్నాయి. అయితే ఎలాగైనా వీరిని మట్టుపెట్టాలనే ఉద్దేశంతో భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఉగ్రవాదుల మరణించిన ఆచూకీ లభించలేదు. భద్రతా బలగాలు కౌంటర్ టెర్రరిజం కోసం కొత్త తరహా ఆయుధాలు, స్ట్రైక్ సామర్థ్యం ఉన్న హెరాన్ డ్రోన్లను వాడుతున్నారు.

పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా ప్రాక్సీ సంస్థ అయిన ‘ ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు ముగ్గురు టెర్రరిస్టులు అటవీ ప్రాంతంలో నక్కి ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. సెర్చ్ ఆపరేషన్ కి నాయకత్వం వహించిన కల్నల్ మన్ ప్రీత్ సింగ్, ఎన్ కౌంటర్ మొదలైన కొద్ది సేపటికే మరణించారు. మేజర్ ఆశిష్ ధోన్‌చక్, డీఎస్పీ హిమాయున్ భట్ తీవ్రగాయాలతో మరణించారు.