Assam Rains: అసోంలో ఈ ఏడాది భారీ వర్షాలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు వందలాది మంది వర్షాలు, వరదలు కారణంగా మృతి చెందారు. 12 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి జోగెన్ మోహన్ శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో తెలిపారు. వరదల వల్ల సంభవించిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా క్రోడీకరించబడుతున్నాయని.. అయితే అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇప్పటివరకు 12 లక్షల95 వేల 642 మంది ప్రభావితమయ్యారని ఆయన చెప్పారు.
109 రెవెన్యూ సర్కిళ్లలో 3,335 గ్రామాల్లోని 23,000 ఇళ్లు ప్రభావితమయ్యాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ చంద్ర నారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా మోహన్ తెలిపారు. 37 చెరువు కట్టలు దెబ్బతిన్నాయని, 133 కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని మంత్రి తెలిపారు. వార్షిక వరదల వల్ల పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ పరిధిలోని 1,106 రోడ్లు, 101 వంతెనలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది వర్షాలు, వరదలతో ఇప్పటివరకు 16,663 జంతువులు మృత్యువాత చెందాయని అన్నారు. ఉచిత సహాయం కోసం రూ. 137.2 కోట్లు, పునరావాస మంజూరు కోసం రూ. 25 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి జోగెన్ మోహన్ తెలిపారు.