Leading News Portal in Telugu

Bihar: ఒకరికొకరు కొట్టుకున్న పోలీసులు.. బయటపడిన పోలీసుల నిర్వాకం


బీహార్ లో పోలీసుల నిర్వాకం బయటపడింది. నలందలో ఇద్దరు పోలీసులు ఒకరికొకరు కొట్టుకున్నారు. ఈ ఘటన సోహ్సరాయ్ రైల్వే హాల్ట్ సమీపంలో జరిగింది. అంతకుముందు కూడా ఆ రాష్ట్రంలో వైశాలిలోని పోలీస్ స్టేషన్‌లో 900 లీటర్ల మద్యం పట్టుబడి స్మగ్లర్లకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడీ ఈ ఘటనతో వీళ్లు పోలీసులా.. రౌడీలా అన్నట్టు తయారయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. డయల్ 112కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు పరస్పరం ఘర్షణ పడ్డారు. వారు బహిరంగంగా ఒకరినొకరు కొట్టుకోవడం చూసిన అక్కడి జనాలు వారి ఫైటింగ్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడది వైరల్ అవుతుంది. అయితే వారిద్దరి మధ్య ఏదో సమస్య తలెత్తి పరస్పరం ఘర్షణకు పాల్పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడం, దుర్భాషలాడుకోవడం చేశారు. అయితే ఈ గొడవకు గల కారణం.. డబ్బుల విషయమని తెలుస్తోంది.

దొంగలు దొంగలు కొట్టుకుంటే ఏమీ కాదు కానీ.. ఇలా పోలీసులు కొట్టుకోవడమంటే జనాలు ఎగబడి చూస్తారు. అయితే వారిద్దరూ ఘర్షణ పడుతుంటే.. కొందరు వ్యక్తులు ఆపే ప్రయత్నం చేశారు. పోలీసులై ఉండి మీరు నడిరోడ్డుమీద ఇలా చేయడం బాగోలేదని కొందరు సలహాలు ఇచ్చారు. మరికొందరు వారిని తిట్టిపోస్తూ.. ఇదీ పోలీసుల నిర్వాకం అని అంటున్నారు. వీళ్లే ఇలా గొడవ పడుతుంటే.. ఇక సామాన్య ప్రజలను ఎలా కాపాడుతారని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు పోలీసుల ఘటనపై నలంద ఎస్పీ అశోక్ మిశ్రా స్పందించారు. వారిద్దరిని గుర్తించామని.. మార్గమధ్యలో కొట్లాడుతూ పోలీసుల పరువు తీశారన్నారు. వారిద్దరినీ సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.