Parliament special session: వందేళ్ల నాటి కట్టడం, భారతదేశ భవిష్యత్తు, అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి చిరునామా నిలిచిన పార్లమెంట్, నేడు కొత్త భవనంలోకి తరలివెళ్తోంది. ఎన్నోచర్చలు, భావోద్వేగాలు, ఉగ్రవాద దాడికి కూడా ఈ బ్రిటీష్ హయాంలోని కట్టడం సాక్ష్యంగా నిలిచింది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మోడీ సర్కార్ కొత్త పార్లమెంట్‌ని నిర్మించింది. తాజాగా ఈ రోజు నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోకి సభ మారనుంది. ఇప్పటి నుంచి కొత్త పార్లమెంట్ దేశ భవిష్యత్తుకు కొత్త చిరునామా కానుంది.
సభ కొత్త పార్లమెంట్ భవనానికి మారుతున్న ఈ సమయంలో ఎంపీలంతా పాత పార్లమెంట్ భవనానికి ఘనంగా వీడ్కోలు చెప్పారు. మంగళవారం లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ హౌజ్ కాంప్లెక్స్‌లో గ్రూప్ ఫోటో దిగారు. ఈ కార్యక్రమానికి పీఎం మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ఉపరాష్ట్రపతి-రాజ్యసభ చైర్మన్ జగ్‌దీఫ్ ధంఖర్‌తో పాటు ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి, సోనియా గాంధీ, శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
దేశచరిత్రలోనే తొలిసారిగా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర తీసుకురాబోతోంది. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. యూపీఏ హాయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి, ఆమోదింపచేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు లోక్ సభలో చర్చకు రాలేదు. లోక్ సభ ఆమోదిస్తే చారిత్రాత్మక బిల్లు చట్టంగా మారేందుకు అన్ని మార్గాలు తెరుచుకుంటాయి.