Student Suicide: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈరోజు 17 ఏళ్ల బాలుడు 24వ అంతస్తులోని తన అపార్ట్‌మెంట్‌పై నుంచి కిందపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గ్రేటర్ నోయిడాలోని బిస్రఖ్ ప్రాంతంలోని గౌర్ సౌందర్య హౌసింగ్ సొసైటీలో జరిగిన ఈ ఘటన ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి పేరు ప్రణవ్ కాగా.. ప్రాథమిక విచారణలో ప్రణవ్‌ది ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు.
మంగళవారం ఉదయం 6:30 గంటలకు, హౌసింగ్ సొసైటీ సూపర్‌వైజర్ అక్కడ తన కుటుంబంతో నివసించే 17 ఏళ్ల బాలుడు వారి 24వ అంతస్తులోని అపార్ట్‌మెంట్ నుండి పడిపోయాడని పోలీసులకు తెలిపినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. సూపర్‌వైజర్ సమాచారం అందించిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. యువకుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ వైద్యులు చనిపోయినట్లు ప్రకటించారు, ప్రాథమికంగా ఇది ఆత్మహత్య కేసుగా కనిపిస్తుందని అధికారి తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.