Road Accident: పంజాబ్‌లోని ముక్త్‌సర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బస్సు కెనాల్‌లో పడిపోయిన ఘటనలో దాదాపు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ముక్త్‌సర్ జిల్లాలోని సిర్హింద్ ఫీడర్ కెనాల్‌లో 35 మందితో వెళ్తున్న ప్రైవేట్ బస్సు పడిపోయిన ఘటనలో 8 మంది ప్రయాణికులు మరణించారని అధికారులు తెలిపారు. ముక్త్‌సర్-కొట్కాపురా రహదారిలోని ఝబెల్‌వాలి గ్రామ సమీపంలో డ్రైవర్ సడెన్ బ్రేకులు వేయడంతో బస్సు అదుపు తప్పి కాలువ పడిపోయిందని, ఈ సంఘటన జరిగిన సమయంలో వర్షం కురుస్తోందని వారు తెలిపారు.
రెస్క్యూ ఆపరేషన్ కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందాన్ని రప్పించారు. ఘటన జరిగిన సమయంలో బస్సు ముక్త్‌సర్ నుంచి కొట్కాపురా వెళ్తోంది. ముక్త్‌సర్ డిప్యూటీ కమిషనర్ రూహీ డగ్ ప్రకారం, కాలువలో బలమైన నీటి ప్రవాహానికి కొంతమంది ప్రయాణికులు కొట్టుకుపోయి ఉండవచ్చని అనుమానించారు. వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని డగ్ తెలిపారు.
క్రేన్ సాయంతో బస్సును కాలువ నుంచి బయటకు తీశామని, గాయపడిన కొంతమంది ప్రయాణికులను ఆస్పత్రికి తరలించామని చెప్పారు. బస్సు డ్రైవర్ ప్రకారం, బస్సులో మొత్తం ప్రయాణికుల సంఖ్య 35 మంది వరకు ఉండవచ్చని డీసీపీ రూహీ డగ్ చెప్పారు. ప్రమాదం జరగడంతో గ్రామస్తులు ముందుకు వచ్చి ప్రయాణికులను రక్షించారు.పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ.. జిల్లా పరిపాలన బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయని, రెస్క్యూ ఆపరేషన్ గురించి తనకు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు వస్తున్నాయని అన్నారు.