Leading News Portal in Telugu

Turkey On Kashmir: టర్కీ బుద్ధి వంకర.. యూఎన్‌లో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన ఎర్డోగాన్


Turkey On Kashmir: ఎన్నిసార్లు భారత్ చెబుతున్నా పాకిస్తాన్ మిత్రదేశం టర్కీ తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ మరోసారి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తాడు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెషన్‌లోని అత్యున్నత స్థాయి 78వ సెషన్‌లో ప్రపంచ నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాడు. దక్షిణాసియాలో ప్రాంతీయ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు ఉండాలంటే భారత్, పాకిస్థాన్ దేశాలు చర్చలు, సహకారం ద్వారా కాశ్మీర్ లో న్యాయమైన, శాశ్వతమైన శాంతనిి నెలకొల్పాలి అని అన్నారు.

ఇరు దేశల మధ్య చర్చలకు టర్కీ మద్దతు ఇస్తూనే ఉంటుందని ఎర్డొగాన్ తెలిపారు. జీ20 సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీలో చర్చించిన కొన్ని రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ పాత్ర పోషించడం గర్వించదగ్గ విషయమని ఎర్డొగాన్ అన్నారు. భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలతో పాటు 15 తాత్కాలిక సభ్యదేశాలను, శాశ్వత సభ్యదేశాలుగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ 20 సభ్యదేశాలు రొటేషన్ లో శాశ్వత సభ్యదేశాలుగా ఉండాలని, అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ కన్నా ప్రపంచం చాలా పెద్దదని ఆయన వ్యాఖ్యానించారు.

టర్కీ ఇలా కాశ్మీర్ అంశాన్ని యూఎన్ లో లేవనెత్తడం ఇది మొదటిసారి కాదు. పలు సందర్బాల్లో పాకిస్తాన్ కి వత్తాసు పలికింది. ఇరుదేశాలకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా కాశ్మీర్ సమస్య పరిస్కారం కాకపోవడం దురదృష్టకరమని ఎర్డొగాన్ తాజాగా వ్యాఖ్యానించారు. అయితే కాశ్మీర్ భారత అంతర్గత విషయమని మనదేశం పలుమార్లు టర్కీ వ్యాఖ్యాల్ని తిప్పికొట్టింది. కాశ్మీర్ సమస్యను లేవనెత్తితే తాము సైప్రస్ సమస్యను లెవనెత్తుతామని భారత్ పలు సందర్భాల్లో టర్కీకి చెప్పకనే చెప్పింది.