Leading News Portal in Telugu

Agra Container: డ్రైవర్‌ లేకుండా రోడ్డుపై దూసుకెళ్లిన కంటెయినర్‌.. పరుగులు తీసిన జనాలు!


Container Ran on Road without Driver in Agra: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ కంటైనర్ డ్రైవర్ లేకుండానే రోడ్డుపై పరుగులు తీసింది. ట్రాన్స్ యమునా పోలీస్ స్టేషన్ పరిధిలోని టెడి బాగియా కూడలి సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సరుకులు తీసుకునేందుకు కిందకు దిగిన లారీ డ్రైవర్‌.. హ్యాండ్‌ బ్రేక్‌ వేయడం మరిచిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ లేకుండా రోడ్డుపై వెళ్తున్న లారీని చూసి టెడి బాగియా కూడలి సమీపంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు.

డ్రైవర్ లేకుండా లారీ రోడ్డుపై పరుగులు తీయడంతో టెడి బాగియా కూడలి ప్రాంతంలో గందరగోళం నెలకొంది. లారీ రోడ్డు పక్కనే ఉన్న ఓ మద్యం దుకాణంలోకి దూసుకెళ్లింది. మద్యం దుకాణంలోకి వెళ్లే క్రమంలో రెండు కార్లు, మూడు బైక్‌లను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కొంతమంది ద్విచక్ర వాహనదారులతో పాటు ఓ చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. హ్యాండ్‌బ్రేక్‌ వేయడం మరచిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపాడు.