Leading News Portal in Telugu

Emergency Alert: మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్‌ వచ్చిందా..? కంగారు పడకండి.. కారణం అదే


Emergency Alert to Smart Phones: దేశ వ్యాప్తంగా కొంతమంది ఫోన్లు గురువారం రోజు కుయ్.. అంటూ మోగాయి. అయితే అది విన్న వెంటనే అసలు ఏం జరగుతుందో తెలియక చాలా మంది కంగారు పడ్డారు. ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో తెలియక అంతా అయోమయంలో పడ్డారు. దానిని చూస్తే తీవ్రమైన పరిస్థితి” అని అర్థం వచ్చేలా ఒక ఫ్లాష్ మెసేజ్ ఉంది. అయితే ఇది చూసి భయపడాల్సిన పని లేదు. దీనిని కేంద్రప్రభుత్వమే పంపింది. ఎమర్జెన్సీ నోటిఫికేషన్ సిస్టమ్‌ను పరీక్షించడంలో భాగంగా  చాలా మంది ఫోన్లకు ఈ మెసేజ్ వచ్చింది. కేవలం ఈ రోజు మాత్రమే కాకుండా గతంలో కూడా రెండు సార్లు ఇలాంటి మెసేజ్ లను పంపించింది కేంద్రప్రభుత్వం. కొంతమంది వినియోగదారులకు జూలై 20, ఆగస్టు 17న కూడా ఇలాంటి మెసేజ్ లను పంపారు.

భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సహకారంతో కేంద్రం ఈ అత్యవసర హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేసింది. తాజాగా, గురువారం ఉదయం 11:41 గంటల ప్రాంతంలో దీనిని పరీక్షించగా, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కొంతమంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు పెద్ద సౌండ్‌తో ఒక ఫ్లాష్ మెసేజ్ వచ్చింది. తరువాత కొద్ది సేపటికి 12:10 నిమిషాల ప్రాంతంలో కూడా మరోసారి ఇలాంటి మెసేజ్ వచ్చింది. దీనిని కమ్యూనికేషన్స్ సెల్యులార్ బ్రాడ్‌కాస్ట్ సర్వీస్ విభాగం పంపించింది. “అత్యవసర హెచ్చరిక: తీవ్రమైన పరిస్థితి” అంటూ ఈ హెచ్చరిక  మెసేజ్ వచ్చింది. ఏవైనా ప్రమాదాలు జరిగే సందర్భాల్లో ప్రజలను వెంటనే అప్రమ్తం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. మొబైల్ ఆపరేటర్లు , మొబైల్ సిస్టమ్‌ల అత్యవసర ప్రసార సామర్థ్యాలను అంచనా వేయడానికి ఈ ట్రయిల్స్ నిర్వహిస్తున్నట్లు టెలికాం, మాస్ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ గతంలోనే పేర్కొంది. ఈ మెసేజ్ రావడంతో చాలా మంది దానిని స్ర్కీన్ షార్ట్స్ తీసి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు