Leading News Portal in Telugu

Medical Students: మెడికల్ స్టూడెంట్లకు గుడ్‌న్యూస్.. ఇకపై ఈ దేశాల్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు..


Medical Students: భారతీయ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఇకపై ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్ విదేశాల్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్( WFME) నుంచి వచ్చే 10 ఏళ్ల కాలానికి జాతీయ వైద్యమండలి(NMC)కి గుర్తింపు లభించినట్లు పేర్కొంది. దీంతో భారత్ లో వైద్య విద్యను అభ్యసించిన వారు కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ దేశాల్లో పీజీ కోర్సులు చేయడంతో పాటు అక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చని వెల్లడించింది. 2024 నుంచి మెడికల్ స్టూడెంట్స్ విదేశాల్లో విద్య, ప్రాక్టీసు కోసం అఫ్లై చేసుకోవచ్చని తెలిపింది.

ఇప్పటికే ఇండియాలో 706 మెడికల్ కాలేజీలు WFME గుర్తింపు పొందాయి. రాబోయే 10 ఏళ్లలో ఏర్పాటు చేయబోయే అన్ని కొత్త వైద్యకళాశాలు ఆటోమెటిక్‌గా ఈ గుర్తింపును పొందుతాయి. ఈ విధానం ద్వారా ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అంతర్జాతీయ వైద్య విద్యార్థులకు భారతదేశాన్ని గమ్యస్థానంగా మార్చునుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన విద్యార్థులు ప్రాక్టీసు చేసుకునేందుకు, మెరుగైన విద్యను పొందేందుకు అవకాశం ఉంటుందని ఎన్ఎంసీ ప్రతినిధి డాక్టర్ యోగేందర్ మాలిక్ తెలిపారు.

వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ (WFME) అనేది ప్రపంచవ్యాప్తంగా వైద్య విద్య యొక్క నాణ్యతను పెంపొందించడానికి రూపొందించబడిన ఓ సంస్థ. దీని లక్ష్యం మానవాళికి మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందించడం. WFME) గుర్తింపు కోసం ప్రతీ వైద్య కళాశాల నుంచి 60 వేల డాలర్లను రుసుముగా వసూలు చేస్తుంది. దేశంలోని 706 మెడికల్ కాలేజీలు WFME గుర్తింపు పొందేందుకు రూ. 351.9 కోట్లు ఖర్చు అవుతుంది.