JDS: మాజీ ప్రధాని దేవెగౌడ పార్టీ జనతా దళ్ సెక్యులర్(జేడీఎస్) రేపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కర్ణాటక మాజీ సీఎం, దేవెగౌడ కొడుకు కుమారస్వామి గురువారం పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైనట్లు తెలుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఇప్పటికే ఈ దిశగా సీట్ల పంపకాలపై కూడా ఇరు పార్టీలు ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది.
శుక్రవారం దేవెగౌడ, కుమారస్వామి ఇద్దరూ ప్రధాని నరేంద్రమోడీని కలిసే అవకాశం ఉంది. ఈ భేటీ తరువాత నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్(ఎన్డీయే)లోకి జేడీఎస్ చేరుతున్నట్లు వార్త వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 28 ఎంపీ సీట్లు ఉన్నాయి. దక్షిణాదిలో కేవలం ఒక్క కర్ణాటకలోనే బీజేపీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో కర్ణాటకలో మెజారిటీ ఎంపీ స్థానాలను బీజేపీ దక్కించుకుంది. ఈ సారి కూడా ఆ రాష్ట్రంలో ఎంపీ సీట్లను దక్కించుకోవాలని చూస్తోంది.
ఇదిలా ఉంటే ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధింది, బీజేపీని గద్దె దించింది. ముఖ్యంగా కింగ్ మేకర్ గా ఉన్న జేడీఎస్ పార్టీ గణనీయంగా ఓట్ షేర్, సీట్లను కోల్పోయింది. కేవలం 19 స్థానాలకే పరిమితమైంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో వెళ్తేనే పార్టీ, ఓట్ షేర్ మిగులుతుందని జేడీఎస్ భావిస్తోంది. తమకు జేడీఎస్ ఓట్ షేర్ కూడా కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది.