Leading News Portal in Telugu

Himanta Biswa Sarma: సోనియాగాంధీపై విద్వేష వ్యాఖ్యలు.. అస్సాం సీఎంపై ఎఫ్ఐఆర్..


Himanta Biswa Sarma: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వసర్మ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని అస్సాం కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీంతో హిమంతపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అస్సాం ప్రతిపక్షనేత, కాంగ్రెస్ పార్టీకి చెందిన దేబబ్రత సైకియా ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిషాలో ఎన్నికల ప్రచారంలో ‘జన ఆశీర్వాద ర్యాలీ’లో పాల్గొన్న హిమంత బిశ్వసర్మ సోనియా గాంధీపై విద్వేశపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

సోనియా గాంధీ అధికారిక నివాసమైన 10 జన్‌పథ్‌ని తగలబెట్టాలని అస్సాం సీఎం పిలుపునిచ్చారని సైకియా ఆరోపించారు. విదిషా ర్యాలీలో హిమంత ఈ వ్యాఖ్యలు చేసినందుకు తాను ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చిందని సైకియా తెలిపారు. ఆ ర్యాలీలో హిమంత మాట్లాడుతూ..‘‘ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం కమల్ నాథ్ హనుమంతుడి భక్తుడైతే, హనుమంతుడు లంకను తగలబెట్టిన విధంగా 10 జన్‌పథ్‌ని తగలబెట్టాలి’’ అని పిలుపునివ్వడం వివాదాస్పదం అయింది.

చట్టపాలన ఉన్న దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు మంచిది కాదని కాంగ్రెస్ నేత సైకియా అన్నారు. సోనియాగాంధీ పార్లమెంటులో సీనియర్ సభ్యురాలు, కాంగ్రెస్, యూపీఏలకు ప్రాతినిధ్యం వహించారని, ఆమెపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నానని, అస్సాం ముఖ్యమంత్రి నుంచి ఇలాంటి మాటు వస్తాయని అనుకోలేదని సైకియా అన్నారు.

ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. వరసగా నాలుగు సార్లు బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంటోంది. ఈ సారి ఎలాగైనా బీజేపీని, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ని గద్దె దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్ ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కీలకం కానున్నాయి. మధ్యప్రదేశ్ తో పాటు చత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.