Leading News Portal in Telugu

Imphal: మణిపూర్ లో మళ్లీ అల్లర్లు.. ఆ వ్యక్తి కోసమే గొడవ


Fresh clashes in Imphal in Manipur : చాలా కాలంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న మణిపూర్ లో ఈ మధ్యే శాంతి నెలకొంది. అయితే ఇంతలోనే  మళ్లీ హింస చెలరేగింది. మైతేయ్‌, కుకీ జాతుల మధ్య వివాదం గతంలో ఘర్షణకు కారణమయితే ఒక వ్యక్తిని బెయిల్ పై విడుద చేసి మళ్లీ అరెస్ట్ చేయడం తాజా నిరసనలకు కారణం. భద్రతా బలగాల యూనిఫాంలతో అత్యాధునిక ఆయుధాలతో తిరుగుతున్న ఐదుగురు యువకులను పోలీసులు సెప్టెంబర్ 16న అరెస్ట్ చేశారు. అయితే వారిని బెయిల్ పై విడుదల చేశారు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు.  బెయిలుపై విడుదలైన ఐదుగురు విలేజ్ డిఫెన్స్ వలంటీర్లలో ఒకరిని కేంద్ర భద్రతా సంస్థ తిరిగి అరెస్ట్ చేసింది.

పదేళ్ల క్రితం నాటి కేసులో  అతడిని పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. బెయిలుపై విడుదలైన తర్వాత మిగతా నలుగురిని అధికారులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిషేధిత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మెయిరంగ్‌థెమ్ ఆనంద్‌ను మాత్రం తిరిగి పోలీసులు  అరెస్ట్ చేశారు. తన భర్తను ఎప్పటిదో కేసులో పోలీసులు అరెస్ట్ చేశారని ఆనంద్ భార్య ఏడుస్తూ చెప్పింది. తామందరం బెయిలుపై విడుదలైన తర్వాత ఆనంద్‌ను కొందరు అధికారులు తీసుకెళ్లారని, అతడిని చూడ్డం అదే చివరిసారని బెయిలుపై విడుదలైన మరో  చెప్పాడు. దీంతో సెక్యూరిటీ దళాలు, నిరసనకారుల మధ్య ఇంఫాల్ పశ్చిమలోని కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు మొదలయ్యాయి. ఆనంద్ ను విడుదల చేయాలంటూ స్థానికులు పోలీస్‌స్టేషన్‌ల ముట్టడికి యత్నించారు.పరిస్థితులు చేయిదాటిపోకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యగా తూర్పు, పశ్చిమ ఇంఫాల్‌ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. 48 గంటల పాటు ఆ ప్రాంతంలో లాక్‌డౌన్‌ విధించారు. ఈ నిరసనలో వందలాది మంది నిరసనకారులు పాల్గొనడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును కూడా ప్రయోగించారు. ఆందోళనకారులు రోడ్లపై టైర్లు తగలబెట్టి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇప్పుడిప్పుడే చల్లబడిన మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగినట్లయ్యింది.