బీహార్లోని బెగుసరాయ్ జిల్లా లఖో పోలీస్ స్టేషన్ పరిధిలో శివాలయంలో ఉన్న శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురై.. NH 31 జాతీయ రహదారిపై తీవ్ర గందరగోళం సృష్టించారు. అంతేకాకుండా.. ఖాతోపూర్ చౌక్‌లో ఉండే దుకాణాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆందోళన చేస్తున్న వ్యక్తులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రజలు.. పోలీసులపై రాళ్లు రువ్వారు. అంతేకాకుండా.. ఆ సమయంలో కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ పై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఘటనలో అక్కడి ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు జనాలు రాళ్లదాడి చేసిన ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు.
ఈ ఘటనపై సదర్ హెడ్ క్వార్టర్ డీఎస్పీ నిషిత్ ప్రియ మాట్లాడుతూ.. ఆలయంలో నిర్మించిన శివలింగాన్ని కొన్ని గుర్తు తెలియని దుండగులు పగలగొట్టారని తెలిపారు. దీనితో ఆగ్రహించిన ప్రజలు జాతీయ రహదారిపై నిరసనకు దిగి ఆందోళన చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా కొన్ని దుకాణాలను కూడా ధ్వంసం చేశారన్నారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందని చెప్పారు. ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా.. పలు పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని డీఎస్పీ తెలిపారు.