One Nation, One Election: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీ ఈ రోజు తొలిసారిగా సమావేశమైంది. దేశంలో ఒకే సమయంలో పార్లమెంట్, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించాలని కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కోవింద్ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ తొలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది.
జమిలి ఎన్నికలపై అభిప్రాయాలను కోరేందుకు రాజకీయ పార్టీలు, లా కమిషన్ సభ్యులను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. మొదటి సమావేశానికి కేంద్ర హొంశాఖ మంత్రి అమిత్ షా, న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, మాజీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్‌కె సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి హాజరయ్యారు. ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే వర్చువల్ గా హాజరయ్యారు. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఈ సమావేశానికి హాజరుకాలేదు.
జమిలి ఎన్నికలపై గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్న పార్టీలు, పార్లమెంట్ లో సభ్యులు ఉన్న పార్టీలు, ఇతర గుర్తింపు పొందిన పార్టీలను ఆహ్వానించాలని కమిటి నిర్ణయించింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై నియమించిన కమిటి రాజ్యాంగంలోని ప్రజాప్రాతినిధ్య చట్టాలను, ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించడానికి అవసరమ్యే చట్టాలను, నియమాలను పరిశీలించాలని సిఫారసు చేసింది.