Leading News Portal in Telugu

Sharad Pawar: అదానీని కలిసిన శరద్ పవార్.. రాహుల్ గాంధీని పట్టించుకోవడం లేదని బీజేపీ ఎద్దేవా..


Sharad Pawar: ఎన్సీపీ నేత శరద్ పవార్, బిలియనీర్ గౌతమ్ అదానీని కలిశారు. ఆయన ఇంటితో పాటు కార్యాలయాన్ని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం అహ్మదాబాద్ లో అదానీని కలిశారు. ఇద్దరూ కలిసి అహ్మదాబాద్ లో భారతదేశపు తొలి లాక్టోఫెర్రిన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ‘‘ భారతదేశం యొక్క మొట్టమొదటి లాక్టోఫెర్రిన్ ప్లాంట్ ఎక్స్‌మ్‌పవర్‌ను గుజరాత్‌లోని చాచర్‌వాడిలోని వస్నాలో మిస్టర్ గౌతమ్ అదానీతో కలిసి ప్రారంభించడం ఒక విశేషం’’ అని పవార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కూడా శరద్ పవార్ని ముంబైలోని ఆయన నివాసంలో గౌతమ్ అదానీ కలిశారు. ఇరువురు రెండు గంటల పాటు పలు విషయాలపై చర్చించారు. ఆ తరువాత అదానీపై వచ్చిన ఇండెన్‌బర్గ్ రిపోర్టు సమయంలో కూడా పవార్, అదానీకి అండగా నిలిచారు. పవార్ తన ఆత్మకథ ‘లోక్ మేజ్ సంగటి’లో అదానీపై ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశమైంది.

ఇదిలా ఉంటే పవార్-అదానీ కలయిక కాంగ్రెస్ పై విమర్శలకు దారి తీసింది. కాంగ్రెస్, రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీ ఎద్దేవా చేస్తోంది. 2024లో బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో పాటు శరద్ పవార్ ఎన్సీపీ కూడా ఉంది. మరోవైపు అదానీపై కాంగ్రెస్, రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ-పవార్ ట్వీట్ చేసిన ఫోటోలను ఉద్దేశిస్తూ.. రాహుల్ గాంధీ వినాలనుకుంటే ఈ ఫోటోలు వెయ్యి మాటలు చెబుతున్నాయని అన్నారు. ఇండియా కూటమిలో రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదని అన్నారు.