Supreme Court Issues Notice to Udaya Nidhi Stalin: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ ఏ టైంలో కామెంట్ చేశారో ఏమో కానీ అది మాత్రం ఆయనను వదలడం లేదు. ప్రధాని మోడీతో సహా పెద్ద పెద్ద నాయకులు సైతం ఈ విషయంపై మాట్లాడారు. ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు ఇండియా కూటమిని సైతం చిక్కుల్లో పడేశాయి. అయినా వెనక్కి తగ్గని ఉదయనిధి తన వ్యాఖ్యలపై కట్టబడి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఉదయనిధి స్టాలిన్ కు షాక్ ఇచ్చింది. తాజాగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్, డీఎంకేకు చెందిన ఎంపీ ఏ రాజాతో పాటు మరో 14 మందికి సుప్రీంకోర్టు సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది. ఉదయనిధి వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయ్యింది. దానిపై విచారించిన ధర్మాసనం వీటిపై స్పందన తెలియజేయాలంటూ ఉదయనిధి స్టాలిన్ తో పాటు తమిళనాడు ప్రభుత్వం, ఆ రాష్ట్ర పోలీసు శాఖ, సీబీఐ, ఏ రాజా పాటు మరో 14 మందికి నోటీసులు జారీ చేసింది.
ఇక సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్ దానిని అరికటడం కాదు శాశ్వతంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమానత్వానికి సనాతన ధర్మం వ్యతిరేకమని వ్యాఖ్యనించారు. భారత దేశంలో చాలా మంది సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉండటంతో వారందరి మనోభావాలను స్టాలిన్ వ్యాఖ్యలు దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై చర్యలు తీసుకోవాలని అనేక మంది డిమాండ్ చేస్తున్నారు. రాజకీయనాయకులు ముఖ్యంగా ఈ విషయంలో డీఎంకే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఉదయనిధి వ్యాఖ్యలు ఉంటే డీఎంకే ఎంపీ ఏ రాజా మరో అడుగు ముందుకేసి సనాతన ధర్మాన్ని ఏకంగా ఎయిడ్స్ తోనే పోల్చి నిర్మూలించాలని చెప్పారు. అందుకే ఆయనకు కూడా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.