Leading News Portal in Telugu

Hardeep Singh Nijjar: నిజ్జర్ హత్యపై కెనడాకు నిఘా సమాచారం అందించిన అమెరికా..


Hardeep Singh Nijjar: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తలకు దారి తీసింది. కెనడాలోని సర్రేలో జూన్ నెలలో నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తుల కాల్చి చంపారు. అయితే ఈ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం, భారత్ దౌత్యవేత్తను కెనడా బహిష్కరించడం ఒక్కసారిగా సమస్య తీవ్రతను పెంచింది. ఇటు భారత్ కూడా కెనడియన్ దౌత్యవేత్తను ఇండియా వదిలి వెళ్లాలని ఆదేశించింది.

ఇదిలా ఉంటే నిజ్జర్ హత్యపై కెనడాకు అమెరికా నిఘా సమాచారం అందించిందనే కథనాన్ని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. ఈ సమాచారంతోనే కెనడా, ఈ హత్యలో భారత ప్రమేయం ఉందని ఆరోపించిందని నివేదించింది. ఈ సమాచారాన్ని ‘ఫైవ్ ఐస్’ దేశాల మధ్య సమాచార మార్పిడి ఉందని కెనడాలోని యూఎస్ అగ్ర దౌత్యవేత్త ధృవీకరించడంతో శనివారం ఈ నివేదిక వచ్చింది. ఈ సమాచారమే జస్టిన్ ట్రూడో భారత్ పై ఆరోపణలు చేయడానికి కారణమైంది.

ఐవ్ ఐస్ దేశాలు అనేవి కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్ ఈ దేశాలు. నిజ్జర్ హత్య జరిగిన తర్వాత, దీనిపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని అమెరికా, కెనడా ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్పిందని, ఒక వేళ ఉంటే అమెరికా నిఘా వర్గాలు ముందే కెనడాకు చెప్పేవని కెనడాలో అమెరికా దౌత్యవేత్త డేవిడ్ కోహెన్ సీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అయితే ప్రాణహాని ఉందని ముందుగానే నిజ్జర్ కి కెనడా అధికారులు సమాచారం అందించారని, అయితే భారత్ ప్రభుత్వం కుట్ర గురించి అతనికి చెప్పలేదని న్యూయార్క్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది. కెనడా విచారణకు భారత్ సహకరించాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ భారత్ కి చెప్పారని, అయితే భారత్, అమెరికా మధ్య దౌత్యపరమైన ఇబ్బందులు రాకుండా ఎక్కువగా ప్రయత్నిస్తున్నారని పత్రిక పేర్కొంది.