Leading News Portal in Telugu

India-Canada: “కెనడాలోనే ఖలిస్తాన్ ఏర్పాటు చేయండి”.. ట్రూడోకు వ్యతిరేకంగా ఆందోళన


India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య తీవ్ర దౌత్య ఉద్రిక్తతలకు దారి తీసింది. దీనిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇండియా ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించాడు. ఇదే కాకుండా కెనడాలోని భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించారు. దీనికి ప్రతిగా భారత్ కూడా కెనడియన్ దౌత్యవేత్తను 5 రోజుల్లో దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది. కెనడా ఆరోపణలు అసంబద్ధమైన, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా, కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ఇండియా ధ్వజమెత్తింది.

ఇదిలా ఉంటే జస్టిన్ ట్రూడోకు వ్యతిరేకంగా యునైటెడ్ హిందూ ఫ్రంట్ ఆదివారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపింది. ఖలిస్తాన్ వేర్పాటువాదులకు మద్దతుగా ట్రూడో వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు. ‘‘కెనడాలోనే ఖలిస్తాన్ ఏర్పాటు చేయాలి’’ అని ట్రూడోకు సూచించారు.

కెనడా ప్రధాని నిజంగా ఖలిస్తానీలను ప్రేమిస్తే, కెనడాను విభజించి ఖలిస్తాన్ దేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు..? అని ప్రశ్నించారు. దాన్ని మొదటగా మేమే గుర్తిస్తామని యునైటెడ్ హిందూ ఫ్రంట్ ప్రెసిడెంట్ భగవాన్ గోయల్ అన్నారు. ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను ఇండియాకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

గురుపత్వంత్ సింగ్ పన్నూ నిషేధిత సిక్ ఫర్ జస్టిస్( ఎస్ఎఫ్‌జే) సంస్థకు చీఫ్ గా ఉన్నాడు. ఇదే కాకుండా ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, జై శంకర్, అజిత్ దోవల్‌లపై బెదిరింపుకలు పాల్పడ్డారు. ఇటీవల కెనడియన్ హిందూలు కెనడాను విడిచిపెట్టి భారత్ కి వెళ్లాలని వార్నింగ్ ఇవ్వడం కూడా చర్చనీయాంశం అయింది.