Leading News Portal in Telugu

Good News: బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త


దేశ రాజధాని ఢిల్లీలో బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. మెట్రో మాదిరిగానే బస్సులో ప్రయాణించే వారు కూడా ‘నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్’ (NCMC) సౌకర్యాన్ని పొందనున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని బస్సుల్లో కూడా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ పనులు ముమ్మరం చేసింది. ఈ సదుపాయాన్ని ఈ ఏడాది చివరి నాటికి అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

తొలిదశలో బస్సుల్లో దీన్ని అమలు చేసిన తర్వాత ఆటోలు, ట్యాక్సీలు వంటి ఇతర ప్రజా రవాణా మార్గాల్లో కూడా దీన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్లు ఢిల్లీ రవాణా శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బస్సు కండక్టర్‌కు ఇచ్చిన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషిన్ (ఈటీఎం) నుంచి కార్డును స్వైప్ చేయడం ద్వారా ఛార్జీలు చెల్లించవచ్చు. ఈ కార్డ్ అన్ని మెట్రో స్టేషన్లు, ISBT, ఢిల్లీ టూరిజం కార్పొరేషన్ సమాచార కేంద్రాలలో అందుబాటులో ఉంటుంది. NCMC నుండి ఛార్జీల చెల్లింపు కోసం DTC, క్లస్టర్ బస్సులలో ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషీన్లు(ఈటీఎం)లను అమర్చాలని రవాణా శాఖ ఆదేశాలు ఇచ్చింది.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ ప్రభుత్వ బస్సుల్లో సగటున రోజుకు 40 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఇందులో దాదాపు 35 శాతం మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. రోజుకు 25 లక్షల మందికి పైగా డబ్బులు చెల్లించి టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో.. టిక్కెట్ల కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయడానికి నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ఇప్పుడు బస్సుల్లో కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని వల్ల రాజధానిలో మెట్రో, బస్సులో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యేక టిక్కెట్లు పొందవలసిన అవసరం లేదు.