నవీ ముంబైలో కిడ్నాప్ కలకలం రేపింది. తన ఇంటి బయట ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు. ఈ కేసుకు సంబంధించి 74 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నెరుల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న తమ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు నేరుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఓ వ్యక్తి చిన్నారిని తన చేతుల్లో ఎత్తుకుని వెళ్లిపోతున్నట్లు ఓ కెమెరాలో రికార్డైంది. ఆ తర్వాత నిందితుడి ఆచూకీ కోసం సీనియర్ పోలీసు అధికారి తానాజీ భగత్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం రైల్వే స్టేషన్‌తోపాటు చుట్టుపక్కల ఉన్న 150 సీసీటీవీలను తనిఖీ చేసింది. సీసీటీవీ ఫుటేజీని ఉపయోగించి ఆ వ్యక్తిని గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు వల వేశారు.
నిందితుడు నవీ ముంబైలోని కరావే గ్రామ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు తండ్రి మణి థామస్ బాలికను తన ఇంట్లోనే ఉంచుకుంటున్నాడు. తన మొదటి భార్య చనిపోయిన తరువాత.. థామస్ తిరిగి వివాహం చేసుకున్నాడు. కానీ అతనికి మళ్లీ పిల్లలు పుట్టలేదు. మరోవైపు నిందితుడు.. తనకు బిడ్డ కావాలనే అమ్మాయిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు తెలిపాడు. అంతేకాకుండా.. తనను తీసుకుని రాష్ట్రం విడిచి వెళ్లే యోచనలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మరోవైపు బాలికను క్షేమంగా రక్షించి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. నిందితుడిపై కిడ్నాప్ అభియోగాలు నమోదు కాగా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడికి పిల్లల అక్రమ రవాణా కేసుల్లో ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.