Leading News Portal in Telugu

Kerala: ఎన్‌సీఆర్‌బీ పేరుతో యువకుడికి ఫేక్‌ మెసేజ్‌.. భయంతో విద్యార్థి ఆత్మహత్య


Kerala: కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఓ విషాద ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎన్‌సీఆర్‌బీ పేరుతో ఫేక్ మెసేజ్ రావడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న యువకుడి వయసు 16 ఏళ్లు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) పేరుతో ఫేక్ మెసేజ్ రావడంతో ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనధికార మూవీ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేసేందుకు ఆ యువకుడు ప్రయత్నించినట్లు, ఆ సైట్‌ పేమెంట్ చేయాలని కోరినట్లు పోలీసులు తెలిపారు.

అసలేం జరిగిందంటే.. కోజికోడ్‌లోని ఓ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న ఆదినాథ్ బుధవారం సాయంత్రం చెవాయూర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఆదినాథ్ గదిలో లభించిన సూసైడ్ నోట్‌లో ఆన్‌లైన్‌లో మోసపోయినట్లు అందులో ఉందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. దీంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన తల్లిని ఉద్దేశించి రాసిన సూసైడ్ నోట్‌లో, తాను ఏ అనధికార వెబ్‌సైట్‌కి లాగిన్ చేయలేదని, అయితే తన ల్యాప్‌టాప్‌లో చట్టబద్ధమైన వెబ్‌సైట్‌లో సినిమా చూశానని ఆదినాథ్ పేర్కొన్నారని పోలీసు అధికారి తెలిపారు.

ల్యాప్‌టాప్‌లో అనధికార వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడం వల్ల అతనికి రూ.30 వేలు కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని ఎన్‌సీఆర్‌బీ పేరుతో నకిలీ సందేశం వచ్చింది. అలా చేయని పక్షంలో భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తారని ఆ మెసేజ్‌లో ఉంది. దీంతో విద్యార్థి ఆదినాథ్‌కు భయం వేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ల్యాప్‌టాప్ బ్రౌజర్ హిస్టరీని పరిశీలించగా, చనిపోయిన విద్యార్థి ఏ అక్రమ వెబ్‌సైట్‌ను తెరిచినట్లు కనిపించలేదని ఓ పోలీసు అధికారి అన్నారు. “బ్రౌజర్ చరిత్ర తొలగించబడిందో లేదో మాకు తెలియదు, కానీ నిజం బయటకు తీసుకురావడానికి దర్యాప్తు అవసరం.’ అని ఆయన చెప్పారు. ఇప్పటికే విచారణ ప్రారంభించామని, త్వరలో విద్యార్థి తల్లిదండ్రుల నుంచి సమాచారం సేకరిస్తామని పోలీసులు తెలిపారు. విద్యార్థి మృతి చెందడంతో తల్లిదండ్రులు వేరే ఇంటికి మారారని పోలీసులు వెల్లడించారు.