Leading News Portal in Telugu

Chennai: చెన్నైలో భారీ వర్షానికి కుప్పకూలిన పెట్రోలు బంక్ రూఫ్‌.. ఒకరు మృతి


తమిళనాడులోని చెన్నైలోని సైదాపేట ప్రాంతంలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి ఓ పెట్రోల్ పంపు పై కప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా.. ఒకరు మృతి చెందారు. అంతేకాకుండా.. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అగ్నిమాపక, భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని రక్షించే పనిలో పడ్డారు.

ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కంధసామిగా చెన్నై పోలీసులు గుర్తించారు. మృతుడు పెట్రోల్ పంప్ లో పని చేస్తున్నాడు. మరోవైపు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌ లో ఆస్పత్రికి తరలించారు. పెట్రోల్ పంపు పైకప్పుపై ఇంతకుముందే వర్షం నీరు చేరడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. వర్షం నీరు ఎక్కువై బరువు భరించలేక ఒక్కసారిగా కింద కూలిపోయింది.

ఇదిలా ఉంటే.. చెన్నైలో సాయంత్రం 6 గంటల నుంచి ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రహదారులు దిగ్బంధం అయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. భారీ వర్షం కారణంగా చెన్నైలోని వేలచేరి ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.