Leading News Portal in Telugu

Earthquake: మేఘాలయలో భూకంపం.. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు


Earthquake: ఈశాన్య రాష్ట్రాలను భూకంపం కుదిపేసింది. మేఘాలయ రాష్ట్రంలో రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. సాయంత్రం 6.15 గంటలకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రెసుబెల్‌పరా జిల్లా కేంద్రం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్త్ గారో హిల్స్ లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.

ఈ భూకంపం ధాటికి అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలో ప్రకంపనలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో కూడా పలు చోట్ల భూమి కంపించింది. ప్రస్తుతం ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి వివరాలు అందుబాటులోకి రాలేదు. ఈశాన్య ప్రాంతాల్లో తరుచుగా భూకంపాలు వస్తుంటాయి.

అంతకుముందు రోజు ఆదివారం హర్యానాలో కూడా స్వల్ప భూకంపం వచ్చింది. ఆదివారం రాత్రి 11.26 గంటలకు రోహ్‌తక్ కు తూర్పు ఆగ్నేయంగా 7 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉన్నట్లు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 2.6 తీవ్రతతో భూకంపం వచ్చింది.