Leading News Portal in Telugu

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపడతాం..


Rahul Gandhi: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేశారు. శనివారం మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘జన్ ఆక్రోశ్’ ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీలో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు బదులుగా ఆర్ఎస్ఎస్, కేంద్ర ప్రభుత్వ అధికారులు దేశ చట్టాలను రూపొందిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో ఓబీసీల జనాభాను ఖచ్చితంగా తెలుసుకోవడానికి కుల ప్రాతిపదికన జనాభా గణనను చేపడుతామని అన్నారు.

దేశంలో అందరి భాగస్వామ్యానికి వీలుగా కులగణన నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. షాజాపూర్ జన్ ఆక్రోష్ యాత్రలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దేశం కొంతమంది పారిశ్రామికవేత్తలది కాదని, అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపట్టి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ వర్గాల ప్రజలు ఎంత మంది ఉన్నారో అందరికి తెలియజేస్తామని తెలిపారు. దేశంలో బీజేపీ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు.

దేశంలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారో తెలుసుకునేందుకు కులగణన గురించి ప్రస్తావించగానే బీజేపీ వ్యక్తులు వణికిపోతున్నారని అన్నారు. భారతదేశం 90 మంది అధికారులు(క్యాబినెట్ సెక్రటరీ, ప్రభుత్వ కార్యదర్శులు)లచే నడపబడుతోందని ఆరోపించారు. జనాభాలో 50 శాతం ఉన్న ఓబీసీలు ఉంటే అధికారుల్లో మాత్రం 5 శాతం భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారని అన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం నడవాలని, ఒకరిద్దరు బడా పారిశ్రామికవేత్తల గురించి కాదని, నేను అదానీ వ్యవహారాన్ని లేవనెత్తడంతో తన సభ్యత్వాన్ని రద్దు చేశారని ఆరోపించారు.