దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం జరుగుతుంది. ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించ కముందే ఈ భేటీని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. మోడీ ప్రభుత్వం ఎన్నికల రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే.. ప్రజలకు తక్షణ ఉపశమనం లభించేలా కొన్ని నిర్ణయాలు తీసుకోని వాటిని ఉపయోగించుకోని ఎన్నికలలో క్యాష్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది.
ఇక, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉన్నందున ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వానికి కష్టంగా మారుతుంది. అయితే, కేంద్ర మంత్రివర్గంతో పాటు ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశం కూడా నేడు జరుగుతుంది. ఈ సమావేశంపై కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. పీఆర్సీ పెంపు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.
ఇక, జూలై నుంచి డీఏను పెంచాలని కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు కోరారు. కేంద్ర ప్రభుత్వం డీఏను 3 శాతం వరకు పెంచే అవకాశం ఉండటంతో.. అది 42 శాతం నుంచి 45 శాతానికి పెరుగుతుంది. అయితే, పెరిగిన డీఏతో పాటు అక్టోబర్ నెల జీతం కూడా వస్తుందని కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ మంత్రివర్గం నుండి ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లయితే, ఇది దసరా ముందు ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్ద బహుమతి అవుతుంది. పీఆర్సీ పెంపుతో 47 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది.