Bombay High: మహారాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వరసగా రోగుల మరణాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నాందేడ్, ఛత్రపతి శంభాజీనగర్, నాగ్‌పూర్ ఈ రెండు ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో 50 మందికి పైగా రోగులు మరణించారు. నాందేడ్‌లోని శంకర్రావ్ చవాన్ ఆస్పత్రిల్లో గడిచిన 72 గంటల్లో 16 మంది పిల్లలతో సహా మొత్తం 31 మంది మరణించారు. ఇక శంభాజీనగర్(ఔరంగాబాద్) ఆస్పత్రిలో 18 మరనణాలు సంభవించాయి.
మరోవైపు ఈ రోజు నాగ్‌పూర్ నగరంలోని రెండు ప్రభుత్వ ఆస్పత్రుల్లో గడిచిన 24 గంటల్లో 23 మంది రోగులు మరణించారు. ఇలా వరస మరణాలపై బాంబే హైకోర్టు సీరియస్ అయింది. నాందేడ్, ఔరంగాబాద్ ఆస్పత్రుల్లో రోగుల మరణాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. రేపు అత్యవసర విచారణకు పిలుపునిచ్చింది. బడ్జెట్ కేటాయింపు గురించిన వివరాలను కోర్టు కోరింది. సిబ్బంది, మందుల కొరత కారణంగా మరణాలు సంభవిస్తే సహించేది లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ఈ వివరాలనను శుక్రవారం మధ్యాహ్నం లోగా సమర్పించాలని చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.
బుధవారం ఉదయం మోహిత్ ఖాన్నా అనే న్యాయవాది ఈ విషయాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించాలని కోరారు. రెండు ఆస్పత్రుల్లో వైద్యులు, పడకలు, సిబ్బంది, మందుల కొరత గురించిన ఫిర్యాదుతో పిటిషన్ దాఖలు చేశారు. నాందేడ్, ఔరంగాబాద్ మరణాల గురించి న్యామవాది ఖన్నా పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ మరణాలను సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా సీరియస్ గా తీసుకున్నారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. అయితే మందుల కొరత లేదని నిన్న సీఎం చెప్పారు.