Sikkim Flash Flood: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో మెరుపు వరదలు విషాదాన్ని మిగిల్చాయి. రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటి వరకు 10 మంది మరణించగా.. 82 మంది గల్లంతయ్యారు. మొత్తం 14 వంతెనలు దెబ్బతిన్నాయని, 3000 మంది పర్యాటకులు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వరదల కారణంగా 23 మంది ఆర్మీ సిబ్బంది కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు ఒకర్ని సురక్షితంగా రక్షించగా.. మిగిలిన 22 మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సుపై ఒక్కసారిగా ‘క్లౌడ్ బరస్ట్’ కారణంగా విధ్వంసకరంగా వానలు పడ్డాయి. దీంతో తీస్తా నదికి ఆకస్మిక వరదలు సంభవించాయమి. బుధవారం తెల్లవారుజామున క్లైడ్ బరస్ట్ సంభవించింది. వరదల ధాటికి రాష్ట్రంలో అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రమైన చుంగ్‌తాంగ్ వద్ద డ్యామ్ కొట్టుకుపోయింది. సిక్కిం ప్రభుత్వం ఈ ప్రళయాన్ని విపత్తుగా ప్రకటించింది.
ఎక్కువగా మంగన్ జిల్లాలోని చుంగ్తాంగ్, గాంగ్టక్ జిల్లాలోని డిక్చు ,సింగ్టామ్, పాక్యోంగ్ జిల్లాలోని రాంగ్పో ప్రాంతాలు ఎక్కువగా ప్రమాదానికి గురయ్యాయి. ఈ జిల్లాల్లో మొబైల్ నెట్వర్క్, విద్యుత్ కనెక్షన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం తప్పిపోయిన 23 మంది సైనికుల కోసం త్రిశక్తి కార్ప్స్ బలగాలు తీవ్రంగా శోధిస్తున్నాయి. తీస్తా నది పరివాహక ప్రాంతంలోని గాలింపు చర్యలు చేపడుతున్నారు.