Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు కీలక ఆప్ నేతలు జైళ్లలో ఉన్నారు. సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియాల తర్వాత ఇప్పుడు సంజయ్ సింగ్ జైలులోకి వెళ్లారు. ఇదిలా ఉంటే సంజయ్ సింగ్ అరెస్టుపై బీజేపీపై ఆప్ విమర్శలకు దిగింది. రాజకీయ కక్షలో భాగంగానే బీజేపీ ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తోందని విమర్శిస్తున్నారు.
తాజాగా సంజయ్ సింగ్ తండ్రి, అతని భార్య, ఇతర కుటుంబ సభ్యుల్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కలిశారు. ప్రధాని టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో అత్యంత అవినీతిపరుడు ప్రధాని నరేంద్రమోడీనే అని ఆరోపించారు. ఆప్ నిక్కచ్చి, నిజాయితీ కలిగిన పార్టీ అని, నిజాయితీతో కూడిన మార్గం కష్టమని మనందరికి తెలుసు, వారిలా నిజాయితీ లేనివారిగా మారితే మన సమస్యల్ని పరిష్కారం అవుతాయని కేజ్రీవాల్ అన్నారు.
ఈ కేసులో ఇప్పటి వరకు 1000కి పైగా రైడ్స్ జరిగాయని, చాలా మందిని అరెస్ట్ చేశారని, కానీ ఒక్క రూపాయిని కూడా స్వాదీనం చేసుకోలేదని తెలిపారు. ప్రధాని మోడీ జరిగిన అన్ని అవినీతిలో దందాల్లో పాత్ర ఉందని, నాకు తెలిసి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రధాని మోడీనే అత్యంత అవినీతిపరుడని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. ఇండియా కూటమితో ప్రధాని నిరాశలో ఉన్నారని ఎద్దేవా చేశారు.