Death Penalty: త్రిపురలోని ప్రత్యేక పోక్సో కోర్టు 2019లో ఆరేళ్ల మైనర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను దోషులుగా నిర్ధారించి వారికి మరణశిక్ష విధించింది. నాలుగేళ్ల న్యాయపోరాటం అనంతరం న్యాయస్థానం మంగళవారం శిక్షను ప్రకటించింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుదర్శన్ శర్మ మాట్లాడుతూ.. జూన్ 17, 2019 న ధర్మనగర్లో పొరుగువారు బాలికను కిడ్నాప్ చేశారని తెలిపారు. దీని తరువాత, ఆ బాలిక మృతదేహం ఆమె ఇంటికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న తేయాకు తోటలో కనుగొనబడింది. విచారణ అనంతరం అత్యాచారం, హత్య ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.
మరో కేసులో.. మహారాష్ట్రలోని థానేలోని ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన 64 ఏళ్ల వ్యక్తిని దోషిగా నిర్ధారించి, అతనికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. పోక్సో చట్టం కింద నమోదైన కేసును జస్టిస్ డీఎస్ దేశ్‌ముఖ్ విచారించి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దోషి మహమ్మద్ ఒమర్ షేక్‌కు రూ.1000 జరిమానాను కూడా కోర్టు విధించింది. నవంబర్ 14, 2019న నిందితుడు ఒమర్ షేక్ చాక్లెట్ ఇస్తానని చెప్పి బాలికను ఇంటికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఒమర్ షేక్‌ను అరెస్టు చేశారు.