Cooperative Bank Scam: కేరళలోని సహకార బ్యాంకుల్లో జరిగిన కుంభకోణాలపై పినరయి విజయన్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ కార్యదర్శి అనిల్ ఆంటోనీ బుధవారం విమర్శలు గుప్పించారు. తీవ్రమైన బ్యాంకింగ్ అక్రమాలు, కుంభకోణాల కారణంగా సామాన్యుల జీవితాల పొదుపు ప్రమాదంలో పడుతుందని ఆంటోనీ అన్నారు. కేరళలోని సహకార బ్యాంకుల్లో జరుగుతున్న మోసాలపై కందాల సహకార బ్యాంకు ఎదుట బీజేపీ బుధవారం నిరాహారదీక్ష చేపట్టింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళ వ్యాప్తంగా కాసర్గోడ్ నుంచి త్రివేండ్రం వరకు అనేక ప్రాంతాలు ఉన్నాయని, ఇక్కడ ప్రజల పొదుపు ప్రమాదంలో ఉందన్నారు. ఇప్పటికే చాలా మంది తమ పొదుపును కోల్పోయారు. తమ వద్ద ఉన్న పొదుపు సొమ్ము పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదంతాలు చాలానే ఉన్నాయి. బీజేపీ ఎప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. ప్రతి జిల్లాలో ప్రతి బ్యాంకు నుంచి ప్రజలు తమ డిపాజిట్లను తిరిగి పొందేలా పోరాడుతామన్నారు. ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని, అక్రమాలు, మోసాలకు పాల్పడిన వారిని శిక్షిస్తామన్నారు. సీపీఐ(ఎం) ప్రభుత్వంపై దృష్టి సారించి, పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి, మతతత్వం పెరిగిపోయిందని ఆరోపించారు. అవినీతిని దాచిపెట్టేందుకు సీపీఐ(ఎం) మతవాదాన్ని రెచ్చగొడుతోందని విమర్శించారు.
కేరళలోని సీపీఐ(ఎం) ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆంటోనీ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేరళలో అవినీతి, మతోన్మాదం అనే రెండు అంశాలు మాత్రమే పెరిగాయి.” అని ఆయన అన్నారు. గత రెండు లేదా మూడు సంవత్సరాలలో మహమ్మారి సమయంలో కిట్లు కొనుగోలు చేసిన స్కామ్‌ను తాము చూశామన్నారు. ఓనం సమయంలో ఓనం కిట్లు కొన్న స్కామ్ జరిగిందని ఆయన అన్నారు. పీఎస్సీలో రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో మరో భారీ స్కామ్ జరిగిందని ఆయన ఆరోపణలు చేశారు. కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఆరోపణలు, ప్రత్యారోపణలకు పాల్పడుతోందని అనిల్ ఆంటోనీ అన్నారు. వందలాది బ్యాంకులు మూతపడే ప్రమాదం ఉండటంతో ఇప్పుడు పనులు చేయిదాటిపోయాయని, తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు తమను తప్ప అందరినీ నిందిస్తున్నారని ఆంటోనీ అన్నారు.
“ఆర్బీఐకి డబ్బు ఎలా ఇవ్వాలి, డిపాజిట్లు ఎలా తీసుకోవచ్చు అని నిర్దేశించే కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఈ ఆర్బీఐ నిబంధనలన్నీ కేరళ అంతటా ఉన్న అన్ని సహకార బ్యాంకుల్లో ఉల్లంఘించబడ్డాయి. ఇదంతా కమ్యూనిస్ట్ ప్రభుత్వం కారణంగా జరిగింది.” అని అనిల్ ఆంటోనీ విమర్శలు గుప్పించారు.