Bombay High Court: రూ.100 లంచం తీసుకున్న అధికారి కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి కోర్టు ఉపశమనం ఇచ్చింది. ఈ కేసును విచారించిన హైకోర్టు..2007లో రూ.100 లంచంగా తీసుకోవడం చాలా చిన్న అంశమని, లంచం కేసులో ప్రభుత్వ వైద్య అధికారిని నిర్దోషిగా విడుదల చేస్తూ తీర్పు చెప్పింది. న్యాయమూర్తి జితేంద్ర జైన్‌తో కూడిన సింగిల్ బెంచ్ మంగళవారం దీనిని చిన్న విషయంగా పరిగణించి వైద్యాధికారిని నిర్దోషిగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
కేసు వివరాల్లోకి వస్తే.. 2007లో ఎల్టీ పింగళే అనే వ్యక్తి మహారాష్ట్ర పూణే జిల్లాలోని ఫౌడ్ లోని గ్రామీణ ఆస్పత్రిలో వైద్యాధికారిగా పనిచేసే డాక్టర్ అనిల్ షిండేపై ఆరోపణలు చేశారు. తన మేనల్లుడు చేసిన గాయాలను ధృవీకరించడానికి రూ. 100 లంచం కోరినట్లు ఆరోపించాడు. ఈ విషయంపై ఏసీబీకి పింగళే ఫిర్యాదు చేయడంతో, వల పన్ని డాక్టర్ షిండేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
2012లో షిండేను నిర్దోషిగా విడుదల చేస్తూ స్పెషల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. అయితే ఈ కేసులో ఎలాంటి మెరిట్ లేదని హైకోర్టు తేల్చింది. 2007లో రూ.100 లంచాన్ని స్వీకరించడం అనేది చాలా చిన్న అంశం, దీన్ని 2023లో అప్పీల్ చేయడాన్ని తప్పుపట్టింది. అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనలపై ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. సంతృప్తి కోసం ఇచ్చినట్లు ఆరోపించబడిన లంచం అల్పమైదైతే, ఆ వ్యక్తిని అవినీతిపరుడిగా భావించడానికి కోర్టు నిరాకరించవచ్చు.