Peegate Incident: ఇటీవల కాలంలో విమానాల్లో ప్రయాణికులు తప్పతాగి సహ ప్రయాణికులపై మూత్రవిసర్జన చేసిన ఘటనల్ని మనం చూశాం. అయితే రైలులో కూడా తప్పతాగిన ఓ వ్యక్తి తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువకుడు పీకలదాకా తాగి వృద్ధ దంపతులపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
రైలులో ప్రయాణిస్తున్న రిటైర్డ్ సైంటిస్టు దంపతులకు ఈ జుగుప్సాకరమైన ఘటన ఎదురైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీరు ఏసీ-3 కోచ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో నిందితుడు రితేష్‌కి దంపతులకు మధ్యలో ఘర్షణ జరిగింది. రైలులో మద్యం తాగడాన్ని వారించిన దంపతుల బెర్తుపై రితేష్ మూత్ర విసర్జన చేశాడు.
ఈ ఘటనపై ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. ఫిర్యాదు మేరకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఝాన్సీ రైల్వే స్టేషన్ లో నిందితుడు రితేష్ ని అదుపులోకి తీసుకున్నారు. టీటీఈ అందించిన వివరాల ప్రకారం అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మహోబాలో రైలెక్కిన అతను అప్పటికే మద్యం తాగి ఉన్నట్లు తోటి ప్రయాణికులు గుర్తించారు. ప్రస్తుతం అతడిని బెయిలుపై విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు.