Leading News Portal in Telugu

CEC: 5 రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం


CEC: ఢిల్లీలో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులతో సీఈసీ భేటీ అయింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్‌తో పాటు మిజోరాం ఎన్నికల పరిశీలకులతో అనేక అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్చించింది. ఈ సమావేశానికి మొత్తం 1180 మంది ఎన్నికల పరిశీలకులు హాజరయ్యారు. సజావుగా ఎన్నికల నిర్వహణతో పాటు మద్యం, డబ్బు అక్రమ రవాణాను అరికట్టడం, ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేయాలని వారికి ఎన్నికల సంఘం అవగాహన కల్పించింది. మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలలో అసెంబ్లీ ఎన్నికల సమాయత్తం కోసం ఈ సమావేశం జరిగింది. ఎన్నికల అబ్జర్వర్లు నిక్కచ్చిగా పని చేయాలని.. తటస్థంగా, నైతికంగా ఉండాలని వారికి సూచించింది.

ఎన్నికల పరిశీలకులకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రీఫింగ్ ఇచ్చింది. ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచనలు చేసింది. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన, ప్రేరేపిత రహిత ఎన్నికలను నిర్వహించాలని పేర్కొంది. వికలాంగులు, సీనియర్ సిటిజన్లు , గిరిజన సమూహాలకు ఓటింగ్‌ను సులభతరం చేయాలని, వారికి ఎన్నికల గురించి అవగాహన కల్పించాలని తెలిపింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని, సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టాలని ఆదేశించింది. పరిశీలకులు ఎన్నికల సంఘానికి కళ్లు, చెవులు లాంటివారని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచనలు చేసింది. అదేవిధంగా ఎన్నికల పరిశీలకులకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల బృందం ఈ రాష్ట్రాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే.

త్వరలోనే జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల తేదీలను సీఈసీ ఖరారు చేయనుంది. అక్టోబర్ 8, అక్టోబర్ 10వ తేదీల్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరంలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటి వారం వరకూ ఆయా రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం.