Leading News Portal in Telugu

S JaiShankar: చైనా రుణ ఉచ్చుతో జాగ్రత్త.. జైశంకర్ హెచ్చరిక


S JaiShankar: హిందూ మహాసముద్రం ప్రాంతంలోని అభివృద్ధి సవాళ్లను ఎదుర్కోవాలని బుధవారం ఇండియా పిలుపునిచ్చింది. శ్రీలంక రాజధాని కొలంబోలో జరుగుతున్న ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్(IORA) సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. యూఎన్ కన్వెన్షన్ ఆధారంగా హిందూ మహాసముద్రం స్వేచ్ఛా, బహిరంగ, సమ్మిళిత ప్రదేశంగా ఉండాలని అన్నారు.

ఈ సమావేశంలో చైనాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టులు, భరించలేని రుణాలతో ‘హిడెన్ ఎజెండా’ ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాలని పరోక్షంగా చైనాను ఉద్దేశించి అన్నారు. చైనా రుణ ఉచ్చు గురించి పరోక్షంగా సభ్యదేశాలకు తెలియజేశారు.

చైనా, శ్రీలంకకు భారీగా రుణాలు ఇచ్చి, అవి చెల్లించకపోవడంతో హంబన్ టోటా ఓడరేవును 2017లో ఈక్విటీ కోసం 99 ఏళ్లకు లీజుకు తీసుకుంది. 1.2 బిలియన్ రుణం ఇచ్చి ఏకంగా శ్రీలంక హంబన్ టోటా నౌకాశ్రయాన్ని చైనా స్వాధీనం చేసుకుంది. ఇదే కాకుండా చైనా తన ‘‘బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్ఐ) ద్వారా పలు పేద, వెనకబడిన దేశాలకు అభివృద్ధి పేరుతో రుణాలు అందిస్తూ, వాటిని నెమ్మదిగా రుణ ఊబిలోకి దించుతోంది.

మరోవైపు హిందూ మహాసముద్రంలో భారత్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే శ్రీలంకలో పాగా వేయగా.. ఇటీవల మాల్దీవుల్లో చైనా అనుకూల అధ్యక్షుడు గెలుపొందడంతో ఆ దేశంలో కూడా పాగా వేయాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలోనే భారత్, హిందూ మహాసముద్ర దేశాలను హెచ్చరించారు. బంగ్లాదేశ్, మారిషస్, మలేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల విదేశాంగ మంత్రలు సమావేశానికి 16 మంది మంత్రులు హాజరయ్యారు.