Aligarh Muslim University: ఇజ్రాయిల్- పాలస్తీనా హమాస్ యుద్ధంలో ఇండియాలోని ప్రజలు కూడా ఇరుపక్షాలకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)లో పాలస్తీనాకు మద్దతుగా కొందరు విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం వివాదాస్పదమైంది. పాలస్తీనాకు సంఘీభావం తెలిపేందుకు పలువరు విద్యార్థులు సోమవారం మార్చ్ నిర్వహించినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దీనిపై బీజేపీ రాజ్యసభ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కి లేఖ రాశారు. ఈ విషయంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా భారత వైఖరిని తెలియజేస్తూ హమాస్ దాడిని ఖండించింది. ప్రధాని మోడీ కూడా ఇండియా, ఇజ్రాయిల్ దేశాలు టెర్రరిజం వల్ల బాధపడుతున్నాయని చెప్పారు. కానీ ఏఎంయూ విద్యార్థులు మాత్రం భారతదేశ ప్రయోనాలకు వ్యతిరేకంగా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆయన లేఖలో పేర్కొన్నారు.
దీనిపై స్థానిక పోలిస్ స్టేషన్ లో కేసు నమోదైంది.. నలుగురు విద్యార్థుల పేర్లు ఎఫ్ఐఆర్ లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ లేఖలో పేర్కొన్నారు. భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోంది, అయితే కొందరు మాత్రం వారికి మద్దతు ఇస్తున్నారని అన్నారు. ఇటీవల హమాస్ ఉగ్రవాదులు గాజా నుంచి ఇజ్రాయిల్ పై భీకర దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 1000 మంది ఇజ్రాయిలీలు మరణించారు.