Leading News Portal in Telugu

Sharad Pawar: అజిత్ పవార్ సీఎం కావడం ఎప్పటికీ కలగానే మిగులుతుంది..


Sharad Pawar: అజిత్ పవార్ సీఎం కావడం ఎప్పటికీ కలగానే మిగులుతుంది..

Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన శివసేన, ఎన్సీపీల్లో చీలికలు ఏర్పడ్డాయి. ఈ రెండు చీలిక వర్గాలు బీజేపీతో ప్రభుత్వాన్ని పంచుకుంటున్నాయి. ముఖ్యంగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ని కాదని అజిత్ పవార్ బీజేపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్ తో పాటు శరత్ పవార్ నమ్మినబంట్లుగా పేరున్న నేతలు కూడా అజిత్ వర్గంలోనే ఉన్నారు. మెజారిటీ ఎమ్మెల్యే ఈ వర్గంతోనే జతకట్టారు.

ఇదిలా ఉంటే గురువారం అజిత్ పవార్ గురించి శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ ఎప్పటికీ మహరాష్ట్ర ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. అది కలగానే మిగులుతుందని చెప్పారు. మీడియాతో మాట్లాడిన ఆయన..దేశంలో 70 శాతం రాష్ట్రాల్లో బీజేపీ పాలన లేదని, మహారాష్ట్రలో కూడా అధికారం కోల్పోతుందని జోస్యం చెప్పారు.

ఈ ఏడాది జూలై నెలలో ఎన్సీపీ పార్టీ రెండు వర్గాలుగా ఏర్పడింది. శివసేన(ఏక్‌నాథ్ షిండే)- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ చేరింది. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వర్గంలోకి మరికొంత మంది మంత్రి పదవులను స్వీకరించారు.

శరద్ పవార్ మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో మహారాష్ట్రలో శివసేన(ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ(శరద్ పవార్), కాంగ్రెస్ నేతృత్వంలో మహావికాస్ అఘాడీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో కొన్ని పార్టీలను విచ్ఛిన్నం చేయడం ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చిందని, 70 శాతం రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదని గుర్తు చేశారు. ప్రస్తుతం అజిత్ పవార్ వర్గంలో ఉన్న ఛగన్ భుజ్‌బల్ ఒకసారి సుప్రియా సూలేను ఎన్సీపీ అధ్యక్షురాలిగా చేయాలని ప్రతిపాదించిన విషయాన్ని ప్రస్తావించారని, అయితే ప్రస్తుతం ఆయన అజిత్ పవార్ వర్గంలో ఉన్నారని శరద్ పవార్ అన్నారు.